EPAPER
Wednesday, November 11, 2026
Google search engine
- Advertisment -spot_img

భూ సరిహద్దు వివాదాల శాశ్వత పరిష్కారమే భూ భారతి రీ సర్వే లక్ష్యం

📰 Generate e-Paper Clip

పాత భూ రికార్డుల ఆధునీకరణకు చర్యలు: కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్, నవంబర్ 11 (జనముద్ర): భూ రికార్డులను ఆధునీకరించి, భూ సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడమే భూ భారతి రీ సర్వే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం నాగారం డివిజన్ పరిధిలోని బోగారం గ్రామంలో భూ భారతి రీ సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రీ సర్వే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1954 నాటి పాత సర్వే రికార్డుల సమాచారాన్ని సేకరించి, ప్రస్తుతం చేపడుతున్న రీ సర్వే వివరాలతో పోల్చి భూ రికార్డులను నవీకరిస్తామని తెలిపారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా ప్రతి భూభాగాన్ని ఖచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్లతో గుర్తించి, డిజిటల్ కోఆర్డినేట్లతో కూడిన ప్రత్యేక నంబర్ కేటాయించి రికార్డుల్లో నమోదు చేస్తామని వివరించారు. గ్రామ సరిహద్దులు, గ్రామ భాగాలు, చెరువులు, ప్రభుత్వ భూములు, పట్టా భూములను స్పష్టంగా వర్గీకరించి హద్దులు నిర్ణయిస్తామని చెప్పారు. ఏయే సర్వే నంబర్లలో కొలతలు చేపడతారనే వివరాలను రైతులకు ముందస్తు నోటీసుల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. రోజుకు సుమారు 30 నుంచి 40 ఎకరాల భూమిని సర్వే చేయనున్నట్లు తెలిపారు. భూ భారతి రీ సర్వే ప్రక్రియ విజయవంతం కావడానికి రైతులు, గ్రామస్తులు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటరెడ్డి, సర్వే అండ్ ల్యాండ్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్ యాదగిరిరెడ్డి, రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!