యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
పోచారం, నవంబర్ 11 (జనముద్ర): జాతీయ సమైక్యతా భావాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ, సామాజిక భాగస్వామ్యం, సేవా కార్యక్రమాల ద్వారా దేశ పురోగతికి తోడ్పడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్నేహభావం, కరుణ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకుని ఆచరణలో పెట్టాలని అన్నారు.
ఈ శిబిరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో పాటు అండమాన్, దీవ్, దాద్రా నగర్ హవేలీ తదితర ప్రాంతాల నుంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా భద్రతా విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషారాణి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ చిరంజీవి గోపాల్‌రెడ్డి, క్యాంప్ డైరెక్టర్ ఆర్. సైదా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments