రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, నవంబర్ 11 (జనముద్ర): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి వేగం పుంజుకుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నవారు చేయలేని అభివృద్ధి పనులను తాము మూడేళ్లలోపు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
నియోజకవర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖేడ్ పట్టణ పరిధిలో సుమారు 350 ఎకరాల అటవీ భూమిని గుర్తించి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నారాయణఖేడ్ పట్టణ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులు ప్రజల సహకారంతోనే చేపడుతున్నామని, ఇందుకోసం స్థానిక రైతులు స్వచ్ఛందంగా భూములు అందించారని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణంతో పట్టణంలో అంతర్గత రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గి, పట్టణ విస్తరణకు అవకాశం కలుగుతుందని వివరించారు.
ప్రజల అవసరాలు, భూమి, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రింగ్‌రోడ్డు పనులను దశలవారీగా చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
మాటలతో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, రాజకీయ విమర్శలకు భయపడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments