EPAPER
Monday, November 9, 2026
Google search engine
- Advertisment -spot_img

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

పంటల మార్పిడితో పాటు పశుపోషణపై రైతులు దృష్టి సారించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్, నవంబర్ 9 (జనముద్ర): ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని, నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. వ్యవసాయంతో పాటు పశుపోషణను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు జలాలను వినియోగించే అంశానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రాంచంద్రాపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర పశుసంవర్ధక శిబిరంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులు, గొర్రెలకు గాలికుంటు వ్యాధి నివారణ, నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. జిల్లాలో పశువులు, గొర్రెలు, మేకలకు అందుతున్న వైద్య సేవలపై పశువైద్యులను అడిగి తెలుసుకున్నారు. గొర్రెల కాపరులు మంత్రికి గొర్రెను బహూకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రకృతి వైపరీత్యమని, దాని ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయినా ముందస్తు జాగ్రత్తలతో నష్టాలను తగ్గించుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని, ఇప్పటికే సుమారు మూడు మీటర్ల మేర తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల బోర్‌వెల్స్ ఉండగా, అక్టోబర్ నెలలోనే 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని పేర్కొన్నారు. రైతులు నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

వరి సాగుకు అధికంగా నీరు, విద్యుత్ అవసరమవుతాయని, నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇప్పటి నుంచే పంటల మార్పిడి చేపట్టకపోతే వచ్చే యాసంగి సీజన్‌లో నీటి కొరతతో పంట నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి సహాయం కోరుతామని వెల్లడించారు.

తన తండ్రి కాకా వెంకటస్వామి ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎంతో కృషి చేశారని, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలన్నది ఆయన కల అని మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో సుమారు రూ.11 వేల కోట్ల మేర ఖర్చు జరిగిందని తెలిపారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర 150 మీటర్ల నీటిమట్టానికి అంగీకరిస్తే ఈ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సాగునీటి సమస్య రాజకీయాలకు అతీతమైనదని, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేసే ప్రతిపాదనలపై స్పందిస్తూ.. పంపింగ్, నీటి నిల్వ, విద్యుత్ అవసరాలు, సాంకేతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులకు అవసరమైన సాంకేతిక పరీక్షలు, బోర్‌వెల్స్ పరిశీలన పూర్తయ్యాక తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని వివరించారు.

సింగూరు జలాల వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి మెదక్ జిల్లా అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సమగ్ర పశుసంవర్ధక శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించడంతో పాటు రైతులకు పశుపోషణపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పశుసంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని, నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా గ్రామాల్లో పశుసంపద అభివృద్ధికి, గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పశుసంపద పెంపుతో పాటు పాల ఉత్పత్తి, ఇతర పశుసంవర్ధక ఉత్పత్తులను పెంచాలని సూచించారు. పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, రాంచంద్రాపురం సర్పంచ్ గీతా నరేందర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆదిత్య వర్మ, ఉప సర్పంచ్ నవీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.

 

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!