మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కొమురవెల్లి వెళ్లే మార్గంలో ఘటన
జగదేవ్‌పూర్, నవంబర్ 9 (జనముద్ర): రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లి సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పల్లపు మహేందర్ (24) బుల్లెట్‌పై వెళ్తుండగా, హైదరాబాద్ నుంచి కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి ఇద్దరు వ్యక్తులు మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన కృష్ణయ్య, రామలింగప్ప ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం, మహేందర్ బుల్లెట్‌ను ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో మహేందర్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహేందర్ 2019లో భారత సైన్యంలోని జనరల్ డ్యూటీ (జీడీ) విభాగానికి ఎంపికై, ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని 54 రాష్ట్రీయ రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 18న సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన ఈ నెల 19న తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న రామలింగప్పకు కాళ్లు విరగగా, కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు.


Recent Comments