భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.
రైతులందరూ అధికారులకు సహకరించాలి.
పారదర్శకత ఖచ్చితమైన డిజిటల్ భూ రికార్డుల ఏర్పాటు.
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి.
విశాల భారతి ఇబ్రహీంపట్నం
భూ భారతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం మనోరాబాద్ గ్రామంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి అధ్యక్షతన భూ రీసర్వే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డులను ఆధునికీకరించడం, భూముల కొలతల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించడం, భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించడం, భూ యజమానుల హక్కులను స్పష్టంగా నిర్ధారించడం భూ రీసర్వే ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఆధునిక డిజిపిఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూములను అత్యంత ఖచ్చితత్వంతో సర్వే చేసి, డిజిటల్ భూ రికార్డులను రూపొందించడం జరుగుతుందని వివరించారు. రీసర్వే ద్వారా భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించడం వల్ల రైతుల మధ్య భూ వివాదాలు తగ్గుతాయని, భూముల విస్తీర్ణాన్ని కచ్చితంగా నిర్ధారించడంతో పాటు పాత భూ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
<span;>భూ యాజమాన్య హక్కుల స్పష్టత, ప్రభుత్వ ప్రైవేటు భూముల ఆక్రమణల గుర్తింపు, భూముల సబ్‌డివిజన్ వివరాల నమోదు వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ఖచ్చితమైన భూ రికార్డులు అందుబాటులో ఉండటం వల్ల రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు సైతం సౌలభ్యం కలుగుతుందని వివరించారు. రీసర్వే పూర్తయిన అనంతరం నిబంధనల ప్రకారం కొత్త భూ రికార్డులు, పట్టా వివరాలను డిజిటల్ విధానంలో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. అధికారులు మనోరాబాద్ గ్రామ భూ వివరాలను గ్రామసభలో వెల్లడించారు. గ్రామ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 288 ఎకరాల 07 గుంటలు కాగా, మొత్తం 48 సర్వే నంబర్లు ఉన్నాయి. ఇందులో పట్టా భూమి 267 ఎకరాల 16 గుంటలు, ప్రభుత్వ భూమి 18 ఎకరాల 35 గుంటలుగా వివరించారు. ప్రభుత్వ భూముల్లో ఎండోమెంట్ భూమి 3 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10 ఎకరాల 05 గుంటలు, లావణ్య పట్టా భూమి 5 ఎకరాల 30 గుంటలుగా గుర్తించినట్లు తెలిపారు. రీసర్వే చేయవలసిన సబ్‌డివిజన్ నంబర్లు 388 ఉన్నట్లు వెల్లడించారు.భూ రీసర్వే ప్రక్రియలో రైతులందరూ చురుకుగా భాగస్వాములై అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. రైతులు తమ భూములకు సంబంధించిన పాత రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు, ఇతర సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, సర్వే సమయంలో తమ భూముల సరిహద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలని కోరారు. పారదర్శకమైన, ఖచ్చితమైన డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థ ఏర్పాటుకు భూ రీసర్వే ఎంతో దోహదపడుతుందని, దీనివల్ల భూ యజమానులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏడిఎస్ఎల్ఆర్ ఎం. రామ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, మంచాల్ ఎమ్మార్వో వి .ప్రసాద్ రావు, ఇబ్రహీంపట్నం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే
<span;>డి .శ్రీనివాస్, మండల సర్వేయర్ ఎస్. వి . ధనశ్రీ, మంచాల్ మండల లైసెన్స్ సర్వేయర్లు, గ్రామ పాలన అధికారి ఎన్. జంగయ్య, సర్పంచ్ ఏ . సంజీవ రెడ్డి, మంచాల్ మండల సిబ్బంది గ్రామ రైతులు హాజరయ్యారు.


Recent Comments